తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వైకుంఠ ప్రాప్తిని కలిగించే 'ద్వాదశి పారణ' - ఇలా చేయకపోతే ఏకాదశి వ్రతఫలం దక్కదు! - DWADASHI PARANA SIGNIFICANCE

ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాల్సిన ఈ 'పారణ' గురించి పూర్తి వివరాలివే!

Dwadashi Parana Significance In Telugu
Dwadashi Parana Significance In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2024, 6:35 PM IST

Dwadashi Parana Significance In Telugu :దృక్ పంచాంగం ప్రకారం 'పారణ' అంటే ఉపవాసం విరమించడం. ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి ఘడియలు ముగిసి పోకుండా భోజనం చేయడాన్ని పారణ అంటారు. అయితే ఈ పారణ చేయడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పారణతోనే ఏకాదశి వ్రతఫలం
సరైన పద్ధతిలో పారణ చేయకపోతే ఆచరించిన ఏకాదశి వ్రతం నిష్ఫలం అవుతుంది. అందుకే పారణ నియమానుసారం చేయడం తప్పనిసరి.

ఇది తప్పనిసరి
భవిష్య పురాణంలో చెప్పిన ప్రకారం ఏకాదశి మరుసటిరోజు అంటే ద్వాదశి తిథి రోజున సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఈ పారణ ఎట్టి పరిస్థితుల్లోను ద్వాదశి ఘడియలు ముగియకముందే చేయాలి. ఏకాదశి రోజు భోజనం చేయడం ఎంత తప్పో, ద్వాదశి రోజు భోజనం చేయకపోవడం అంతకన్నా పెద్ద తప్పు.

పారణ ఎలా చేయాలి
ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు సూర్యోదయం తోనే నిద్రలేచి శుచియై శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. మడిగా, శుచిగా తయారు చేసిన చక్కెర పొంగలి, మహా నైవేద్యాన్ని, పండ్లు, కొబ్బరికాయలు శ్రీ మహా విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి పిలవాలి. బ్రాహ్మణునికి కాళ్లు కడిగి, అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నమస్కరించుకోవాలి. తరువాత స్వామికి నివేదించిన పదార్థాలతో బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అనంతరం బ్రాహ్మణునికి చందన తాంబూలం, నూతన వస్త్రం, దక్షిణ సమర్పించి నమస్కరించుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు జలం కూడా స్వీకరించకూడదు. బ్రాహ్మణునికి శాస్త్రోక్తంగా భోజన తాంబూలాలు సమర్పించిన తర్వాత భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి. ఈ మొత్తం ప్రక్రియను పారణ అంటారు.

ద్వాదశి పారణ ఫలం
ఎవరైతే శాస్త్రోక్తంగా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించి, ద్వాదశి పారణ చేస్తారో వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని పురాణ వచనం. కాబట్టి ఏదో ఏకాదశి ఉపవాసం ఉంటున్నాం అని పక్క రోజు పొద్దున్నే భోజనం చేయకుండా శాస్త్రంలో చెప్పినట్లుగా విధివిధానాలతో పారణ చేయడం వలన ఇటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్యంతో పాటు అటు ద్వాదశి పారణ ఫలితాన్ని కూడా పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details