Makara Sankramanam 2025 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశుల ఉన్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణం గా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించింది మొదలు మకర రాశిలో ప్రవేశించడం వరకూ ధనుర్మాసంగా, పండుగ నెలగా వ్యవహరిస్తాం. ఈ సందర్భంగా మకర సంక్రమణం ఎప్పుడు జరుగనుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మకర సంక్రమణం ఎప్పుడు
పుష్య బహుళ పాడ్యమి జనవరి 14 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం ప్రారంభం అవుతుంది.
ఉత్తరాయణ పుణ్యకాలం
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునస్కారాలు, యజ్ఞయాగాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల ఐహిక కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.
చేయాల్సిన విధి విధానాలు
మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. ఈ రోజున స్నానం దానం, పూజ అనే మూడు విధులు తప్పనిసరిగా నిర్వర్తించాలి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టం. వీలుకాని పక్షంలో నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. అలాగే ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో ఎర్రని పువ్వులు వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేసి, ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఎవరికైనా జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. అందుకని శనిదేవుని శాంతింప చేయాలంటే ఈ రోజున నువ్వులు దానమివ్వాలి.
ఉత్తరాయణంలో వాతావరణ మార్పులు
వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు శీతల వాతావరణం, చలిగాలులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. శీతాకాలం బాధలు నివారించుకోవడానికి స్నానం చేసే జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలా తర్పణం అనేవి పాటించవలసిన విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధకమైనట్టివి. రానున్న మకర సంక్రమణం రోజున శాస్త్రంలో చెప్పిన విధివిధానాలు ఆచరించి సుఖమయ జీవితాన్ని పొందుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.