Dussehra Navratri Maha Chandi Devi Avatharam : ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రులలో ఐదో రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పంచమి, దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు.
శ్రీ మహా చండీ దేవి అలంకార విశిష్టత
చండుడు, ముండుడు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. దేవీ భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహ పీడలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన, మానసిక రోగాలు, పిశాచ భయాలు తొలగిపోతాయి. అలాగే మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
గ్రహ దోషాలు పోగొట్టే చండీదేవి పూజ
జాతక చక్రంలో కుజ దోషం, కాలసర్ప దోషం, రాహు కేతు దోషాలు, కుజ రాహు సంధి వంటి దోషాలతో ఇబ్బంది పడేవారు దేవి నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటువంటి చండీదేవి ఆరాధనతో సత్ఫలితాలు పొందుతారని, గ్రహ పీడలు తొలగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
శ్లోకం
"అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది శక్తి సదా పాలయమాం" అంటూ అమ్మను ప్రార్థిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి.