Akshaya Patra Story : స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే కాశీ పట్టణంలో ఎన్నో విశేషాలు. జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అతి ప్రాచీన దేవాలయాలకు నిలయమైన కాశీలో 12 సూర్య దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో పేరుతో సూర్యుడు పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలో 'ద్రౌపద్యాదిత్యుడు'గా సూర్యభగవానుడు పూజలందుకునే ఆలయ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ద్రౌపద్యాదిత్యుడుగా సూర్యభగవానుడు
కాశీలోని 12 సూర్య దేవాలయాల్లో ఒకదానిలో ద్రౌపద్యాదిత్యుని ఆలయం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. స్కాందపురాణంలోని కాశీఖండంలో ప్రకారం ఇక్కడ ద్రౌపది సూర్యభగవానుని ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
ఆకలి దప్పులతో అలమటించిన పాండవులు
పూర్వం పాండవులు మాయాజూదంలో ఓడినప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం సమయంలో పాండవులు ఒకసారి ఆకలిదప్పులతో అలమటిస్తూ కాశీ ప్రాంతానికి చేరుకున్నారంట! ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచని ద్రౌపది ఆహార ప్రదాత, ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడి మూర్తిని ప్రతిష్ఠించి పూజించడం వలన పాండవులకు ఆకలిదప్పుల నుంచి విముక్తి లభించిందని అంటారు.
అందుకే ద్రౌపద్యాదిత్యుడు
ద్రౌపది ప్రతిష్టించి, పూజించిన కారణంగానే ఇక్కడ సూర్యభగవానుడు ద్రౌపద్యాదిత్యుడుగా పూజలందుకుంటున్నాడు.
ధర్మరాజు అక్షయపాత్ర పొందిన ప్రదేశం
పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి 'అక్షయ పాత్ర' వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' ద్వారా మనకు తెలుస్తోంది.