తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? - ఏ విధంగా ఆరాధిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి??" - Navratri Pooja Vidhanam - NAVRATRI POOJA VIDHANAM

Devi Navratri Pooja Vidhan 2024: దేశవ్యాప్తంగా దుర్గా మాతకు అత్యంత ప్రీతికరమైన దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు మరికొద్ది గంటల్లో మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో.. నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేయాలి? ఏవిధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ ఈ విధంగా వివరిస్తున్నారు.

NAVRATRI POOJA VIDHANAM
Devi Navratri Pooja Vidhan 2024 (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 1, 2024, 12:12 PM IST

Navratri Pooja Vidhanam in Telugu: హిందూ పంచాంగం ప్రకారం.. ఏటా దేవీ శరన్నవరాత్రులు అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం మొదటి రోజున ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే.. నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేయాలి? ఏవిధంగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏ రకంగా పూజించినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అంటే.. కలశం, శ్రీచక్రం, అమ్మవారి విగ్రహం, ఫొటో.. ఇలా ఏ విధంగానైనా దుర్గాదేవిని ఆరాధించవచ్చు. అయితే.. మీరు చేసే పూజను బట్టి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని.. అప్పుడే.. దుర్గామాత సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు.

కలశం: శరన్నవరాత్రుల్లో భాగంగా ముఖ్యంగా కలశ పూజ నిర్వహించేవారు కొన్ని కఠిన నియమాలు పాటిస్తూ.. అత్యంత నియమ నిష్ఠలతో దుర్గమ్మను పూజించాలని చెబుతున్నారు. అంటే కలశం పెట్టుకొని దుర్గాదేవిని పూజించేవారు రోజూ మహా నైవేద్యం తప్పక పెట్టాలి. అంటే.. మడి కట్టుకొని అన్నం, పప్పు, కూర, ఏదైనా పిండి వంటకం.. ఇలా అన్నీ వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే మీరు ఆహారం స్వీకరించాలి.

విగ్రహం: దుర్గామాత విగ్రహం పెట్టుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించినా సరే.. ఈ మహా నైవేద్యం సమర్పించే నియమం తప్పక పాటించాలంటున్నారు.

శ్రీచక్రం: కొంతమంది శ్రీ చక్రం పెట్టుకుని అమ్మవారి పూజ చేస్తుంటారు. అలాంటివారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అప్పుడే శుభ ఫలితాలు లభిస్తాయట. శ్రీచక్ర అర్చన చేసే వారు.. గురువు దగ్గర "బాల మంత్రం" స్వీకరించి ఉండాలి. అంటే.. అది బాలా త్రిపురసుందరి దేవికి సంబంధించిన ఒక మూల మంత్రం. ఆ మంత్రం జపిస్తూ నవరాత్రుల్లో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటున్నారు.

  • అయితే.. ఆ మంత్రం లేని వారు శ్రీచక్రానికి పూజ చేయొచ్చా? అంటే.. చేయొచ్చు కానీ.. సాధారణ పూజ చేసుకోవచ్చు. అంటే.. మామూలుగా శ్రీచక్రం ఫొటో ఇంట్లో పెట్టుకొని దానికి గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకొని.. ఆపై కుంకుమతో శ్రీచక్రానికి పూజ చేస్తూ అమ్మవారి 108 నామాలు చదువుకోవచ్చు. అదే.. బాల మంత్రం ఉన్నవారు ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకొని రోజూ దీపారాధన చేసి.. ఆ మంత్రం జపిస్తూ మహా నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు.

ఇంట్లోనే సులభంగా అమ్మవారిని ఎలా పూజించుకోవాలంటే..

  • నవరాత్రులలో భాగంగా ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్రపరచుకొని.. స్నానమాచరించి శుభ సమయంలో ఆచారాల ప్రకారం.. పూజా మందిరంలో అమ్మవారి ఫొటో ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.
  • అయితే.. లలితా పరమేశ్వరి దేవికి సంబంధించిన ఫొటో ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అమ్మవారి రూపం ఏదైనా.. రాజరాజేశ్వరి, లలితా దేవి ఈ రెండింటిని ఒకే రూపం అంటారు. ఆ రూపం ఉన్న ఫొటో పెట్టుకొని నవరాత్రుల్లో పూజ చేసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు.
  • అలాగే.. రోజూ అమ్మవారి అలంకరణాన్ని బట్టి అందుకు సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి. లేదంటే.. మీకు నచ్చిన అష్టోత్తరం చదువుకోవచ్చు. వీలైతే.. లలితా సహస్రనామ స్తోత్రం, దేవీ ఖడ్గమాల స్తోత్రం చదివితే ఇంకా మంచిది.
  • మీరు ఏ ఫొటో పెట్టుకున్నా సరే.. డైలీ అమ్మవారి ఫొటో దగ్గర దీపారాధన చేసి పుష్పాలు, పండ్లు, నైవేద్యం సమర్పించి.. ఈ రెండు స్తోత్రాలు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహాం పొందవచ్చంటున్నారు.
  • అయితే.. ఫొటో పెట్టుకొని దుర్గామాతను పూజించినప్పుడు మాత్రం మహా నైవేద్యం మడితో సమర్పించాలన్న నియమం ఏమీ లేదు. మామూలుగా.. బెల్లం ముక్క లేదా పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించిన సరిపోతుందట.
  • అదేవిధంగా.. విగ్రహం, ఫొటో కలశం, శ్రీచక్రం ఏది పెట్టుకున్నా సరే తప్పకుండా ఉద్వాసన చెప్పుకోవాలి. అలా చేస్తే.. నవరాత్రులు ముగిశాక అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కాగలరు.
  • నవరాత్రుల్లో ఎటువంటి పూజలు చేయలేనివారు.. దేవీ ఖడ్గమాల స్తోత్రం విన్నా, చదివినా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయట. అలాగే.. చండీ సప్తశతి/దుర్గా సప్తశతి స్తోత్రం విన్నా సరిపోతుంది. శత్రుబాధలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా అన్నీ సమస్యలను తొలగింపజేసుకోవడానికి ఈ స్తోత్రం విశేషంగా సహాకరిస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి'

దేవీ శరన్ననవరాత్రులకు.. ఒక్కోచోట ఒక్కో పేరు..! అవేంటో మీకు తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details