Chaturmas Vrat Katha In Telugu: ఒకసారి కైలాసంలో శివ పార్వతులు కులాసాగా సంభాషణించుకుంటున్నారు. ఆ సమయంలో పరమ శివుని చేయి మొత్తగా, మృదువుగా ఉండటాన్ని చూసిన పార్వతి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన తన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. బహుశా అందుకేనేమో విరివిగా దానాలు చేసే వారిని 'ఎముక లేని చెయ్యి' అని వర్ణిస్తారు.
మారువేషంతో పార్వతి
శివుని మాటలు విన్న పార్వతికి కూడా పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారు వేషంతో భూలోకానికి వచ్చింది. నారేళ్లనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తర్వాత సకలైశ్వర్యములు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని ఆచరించే విధానం తెలిపి అంతర్ధానమైపోయింది.
నారేళ్లనాచికి పరీక్ష
అయిదేళ్ల తర్వాత పార్వతికి నారేళ్లనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్లనాచి అమ్మవారు చెప్పిన గోపద్మ వ్రతాన్ని నియమానుసారంగా ఆచరించి ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్లి మంచి నీళ్లడిగింది. నారేళ్లనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీళ్లు ఇమ్మని పని వారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి కైలాసానికి వెళ్లింది.
జ్ఞానోదయం
పార్వతి శివుని దగ్గరకు వెళ్లి నారేళ్లనాచికి ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. నారేళ్లనాచి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. అందుకే అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువు కూడా తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్లి నారేళ్లనాచికి తన తప్పును తెలియజేస్తాడు. తాను నీళ్లివ్వకుండా అవమానించింది సాక్షాత్తూ పార్వతీ దేవినే అని, క్షమాపణలు వేడుకోమని తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన ఆ భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్లు నైవేద్యం చేసి, క్షమించమని కోరింది. సంతసించిన పార్వతీపరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.