తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

తిరుమల చక్రతీర్థ ముక్కోటిని కళ్లారా చూస్తే చాలు- మోక్ష సిద్ధి ఖాయం! - CHAKRATEERTHA MUKKOTI IN TIRUMALA

డిసెంబర్ 12న తిరుమలలో చక్ర తీర్థ ముక్కోటి - ఒక్కసారి దర్శిస్తే జన్మరాహిత్యం, మోక్ష సిద్ధి తథ్యం!

Tirumala
Tirumala (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2024, 4:10 AM IST

Chakrateertha Mukkoti Tirumala : తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో చక్రతీర్థ ముక్కోటి ఒకటి. పవిత్ర తిరుమల గిరుల్లో ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం, చక్ర తీర్థం వంటి తీర్ధాలు తిరుమల పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. డిసెంబర్ 12న చక్రతీర్థ ముక్కోటి సందర్భంగా ఆ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

చక్రతీర్థం ఎక్కడుంది?
తిరుమల వేంకటేశ్వరస్వామి వెలసిన శేషగిరుల మీద దక్షిణ భాగంలో మహా పవిత్ర తీర్థమైన చక్రతీర్థం ఉంది. వరాహ పురాణం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో వెలసిన 66 కోట్ల తీర్థాల్లో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాల్లో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా వెలుగొందుతోంది.

చక్రతీర్థ ముక్కోటి ఎప్పుడు?
మార్గశిర శుద్ధ ద్వాదశి డిసెంబర్ 12వ తేదీ గురువారంచక్ర తీర్థ ముక్కోటి జరగనుంది.

చక్రతీర్థ ముక్కోటి వెనుక పురాణం గాథ
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం, పద్మనాభ మహర్షి అనే గొప్ప మహర్షి చక్ర తీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకు సంతసించి శంఖ చక్ర గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు అక్కడే పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యారు. స్వామి ఆజ్ఞానుసారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేశారు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు మహర్షిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపి ఆ రాక్షసుని సంహరించాడు. అనంతరం ఆ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని మహర్షి కోరారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలో శాశ్వతంగా ఉండమని ఆఙ్ఞాపించారంట. స్వామి వారి ఆజ్ఞ మేరకు ఆనాటి నుంచి సుదర్శన చక్రం అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది. ఆనాటి నుంచి ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

చక్రతీర్థ ముక్కోటి ఎలా చేస్తారు?
తిరుమల గిరులలో వెలసిన మహా పవిత్ర తీర్థమైన చక్రతీర్థం ముక్కోటి సందర్భంగా ఆనాటి ఉద‌యం అర్చకులు, పరిచారకులు మంగళ వాయిద్యాలతో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ప్రదక్షిణంగా చక్ర తీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసిన చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజ‌లు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ చక్రతీర్థ ముక్కోటి చూడటానికి భక్తులు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి విశేషంగా తరలి వస్తారు. ఈ చక్ర తీర్థ ముక్కోటిని కళ్లారా చూసిన వారికి జన్మ రాహిత్యం కలిగి మోక్షం సిద్ధిస్తుందని పురాణ వచనం. చక్రతీర్థ ముక్కోటి రోజు మాత్రమే కాకుండా ఏడాది మొత్తం శ్రీవారి దర్శనానికి వెళ్లిన యాత్రికులు చక్ర తీర్థాన్ని కూడా దర్శించి తరిస్తుంటారు. మనం కూడా తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా చక్ర తీర్ధాన్ని కూడా దర్శిద్దాం. తరిద్దాం. ఓం నమో వేంకటేశాయ!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details