తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'ఉసిరి' ఏకాదశి రోజు ఈ వ్రతం చేస్తే ఎంతో మంచిది- సమస్యలన్నీ మాయం! - Amalaki Ekadashi 2024

Amalaki Ekadashi Vratham Benefits 2024 : ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు. ఉత్తరాదిన ఈ సమయం నుంచి హోలీ వేడుకలు ప్రారంభం అవుతాయి. దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది. మరి అమలక ఏకాదశి గురించి పలు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Amalaki Ekadashi Vratham Benefits 2024
Amalaki Ekadashi Vratham Benefits 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 6:30 PM IST

Amalaki Ekadashi Vratham Benefits 2024 :మనకు ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. మన సంప్రదాయంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజు ఉపవాసం, జాగారం చేసి శివకేశవులను ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

అమలక ఏకాదశి పేరు ఇలా వచ్చింది!
ఇక ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు. ఈరోజు ఉసిరి చెట్టును విశేషంగా పూజిస్తారు. అమలక అంటే ఉసిరికాయ అని అర్ధం. ఉసిరి చెట్టును పూజించడమే ఈరోజు ప్రాధాన్యత కాబట్టి ఈ ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు వచ్చింది.

ఉపవాసం ఎప్పుడు విరమణ చేయాలి?
ఏకాదశి వ్రతాన్ని చేసే వారు ఆరోజు ఉపవాసం చేసి, లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఉసిరికాయ చెట్టును పసుపు కుంకుమలతో, ధూప దీపాలతో పూజించడం సంప్రదాయం. సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తరువాత చంద్ర దర్శనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. మరికొంతమంది ఎంతో నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటారు. వారు ఏకాదశి ఘడియలు ముగిసి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే ఉపవాస విరమణ చేస్తుంటారు. ఈ నియమాలు వారు వారి పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సంప్రదాయాలను అనుసరించి ఉంటుంది.

అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ!
Amalaki Ekadashi Vrat Katha :పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారితప్పి కొంతమంది రాక్షసులు చేతికి చిక్కుతాడు. ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు. చిత్రసేనుడికి ఏమి హాని జరగదు కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది. చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చి పడి ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రాక్షసుల బారి నుంచి తప్పించుకోగలిగాడని పలుకుతుంది. ఈ సంఘటన తరువాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరు ఆచరించడం మొదలు పెడతారు. కాగా, ఈ కథ మనకు బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మహర్షి చెప్పారు.

వ్రతం మహత్యం!
మరొక సంఘటనలో వైదిస రాజు చైత్రరథుడు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకానొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువు, ఉసిరి చెట్టును పూజించారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్తుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలిసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా, అతని మరణం తరువాత అతను వసురత రాజుగా పునర్జన్మ పొందాడు.

ఈ కథలోని నీతి ఏమిటంటే నిష్కామంతో, నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఏ భక్తి లేకున్నా, అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు.

వ్రత నియమాలు
నదీస్నానం లేదా సముద్ర స్నానం వీలుకాకుంటే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోకి పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేయాలి. ఉపవాసం, జాగారం చేయాలి. ఉసిరికాయ చెట్టును పూజించాలి. హరిభక్తిని చాటే భజనలు, కీర్తనలు చేయాలి.

బీరువాలో డబ్బు, నగలు ఒకేచోట పెట్టకూడదు! వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఆదాయం రెట్టింపు!

సుబ్రహ్మణ్యుడి సింపుల్​ పూజ విధానమిదే- మంగళవారం ఇలా చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయ్​!

ABOUT THE AUTHOR

...view details