Alagar Kovil Temple History :వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108దివ్య క్షేత్రాల్లో ఒకటిగా, దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన అళగర్ కోవెల తమిళనాడులోని మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన చెట్ల నడుమ, ఓ కొండ పక్కన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్! మధుర మీనాక్షి దర్శనం కోసం వెళ్లిన వారిలో కొద్దిమంది మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం గురించి అందరికీ పెద్దగా తెలిసి ఉండకపోవడమే ఇందుకు కారణం. మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామి సోదరుడని, అందుకే మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం కూడా తరలివెళ్తుందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
దక్షిణ తిరుపతి అన్న పేరు ఇందుకే!
ఈ ఆలయంలోని స్వామి రూపం వెంకటేశ్వర స్వామి స్వరూపానికి దగ్గరగా ఉండడం, అడుగడుగునా అలరించే ప్రకృతి కారణంగా ఈ క్షేత్రం దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయ వర్ణన తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదికారంలో ఉంటుంది. అంతేకాదు తమిళ సాహిత్యంలో ఎక్కువగా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న శిధిలమైన కోట గోడలు ఆనాటి రాచరికాన్ని గుర్తుచేస్తాయి. సుమారు 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు గత వైభవాన్ని గుర్తుచేస్తాయి. ద్రావిడ దేశాన్ని పాలించిన పాలకుల్లో ఒకరైన సుందరపాండ్యన్ అనే రాజు 13వ శతాబ్దంలో స్వామి వారి విమాన గోపురం మీద పోయించిన బంగారు పోత సూర్యకాంతికి మెరుస్తూ దర్శనమిస్తుంది.
స్వామి బంగారం
అళగర్ కోవెలలో స్వామి మూల విరాట్ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేశారు. ఆలయంలో రథ మండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
అళగర్ కోవెల ప్రాంగణంలో ఉపాలయాలు
అళగర్ కోవెల ప్రాంగణంలో ఉన్న కరుప్పు స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఇది చాలా శక్తిమంతమైనదని అంటారు. కరుప్పు స్వామి ఉగ్ర రూపాన్ని సామాన్యులు చూసి తట్టుకోలేరని అంటారు.
ఎవరీ కరుప్పు స్వామి!
అళగర్ స్వామి ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసింది. ఈ విగ్రహంపై కన్నేసిన 18 మంది దొంగలు ఒకసారి ఈ ఆలయం మీద దాడి చేశారట! అయితే ఇలాంటి దాడి జరగవచ్చని ముందుగానే ఊహించిన పూజారులు దొంగలపై తిరగబడి 18 మంది దొంగలను మట్టి కరిపించారంట! ఆ సమయంలో వారి ముందు కరుప్పు స్వామి అనే కావలి దేవత ప్రత్యక్షమై ఇకనుంచి ఈ ఆలయాన్ని రక్షించే భారం తనదే అని మాట ఇస్తాడు. ఆనాటి నుంచి అళగర్ స్వామికి క్షేత్ర పాలకుడిగా, రక్షకుడుగా కరుప్పు స్వామి అక్కడే వెలసి ఉన్నాడు.
ఏడాదిలో ఒక్కసారే దర్శనం
కరుప్పు స్వామి ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి మాత్రమే తీస్తారు. విచిత్రమేమిటంటే కరుప్పు స్వామి ఆలయం తలుపులు తీసి ఉన్నంత సేపు పక్షులు, క్రిమికీటకాలు సైతం నిశ్శబ్దం వహిస్తాయి. చిన్నపాటి శబ్దం కూడా లేకుండా ఆ పరిసరాలన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. గాలి కూడా వీచదు. వాతావరణం కూడా వేడెక్కిపోతుంది.