Akshaya Navami Usirika Pooja :వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తిక శుద్ధ నవమి రోజు అక్షయ నవమిగా జరుపుకోవాలని తెలుస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ ఆదివారం నాడు ఈ పండుగను జరుపుకోనున్న సందర్భంగా అసలు అక్షయ నవమి అంటే ఏమిటి? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.
అక్షయ నవమి అంటే!
అక్షయం అంటే 'క్షయం' లేనిది అంటే నశింపనిది అని అర్థం. పురాణాల ప్రకారం కార్తీక శుద్ధ నవమి రోజునే సత్యయుగం ముగిసి, త్రేతాయుగం కూడా ప్రారంభమైందని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున అమల నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు చేకూరుతాయని, సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. ఇక ఈ రోజు ఎలాంటి పూజ చేయాలో చూద్దాం.
ఉసిరిక చెట్టు పూజ
అక్షయ నవమి రోజు శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
అక్షయ నవమి పూజకు శుభ ముహూర్తం
ఈ ఏడాది నవంబర్ 9, 2024 శనివారం రాత్రి 10:45 గంటలకు నవమి తిథి ప్రారంభమై, మరుసటి రోజు 10 నవంబర్ 2024 ఆదివారం రాత్రి 9:01 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఆదివారం రోజున అక్షయ నవమి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
అక్షయ నవమి పూజా విధానం
అక్షయ నవమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి శుచియై, నిత్య పూజాదికాలు పూర్తి చేసుకొని, ఈ రోజు ఉపవాసం ఉంటానని భగవంతుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి. అక్షయ నవమి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 'శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
ఉసిరిక చెట్టు పూజ
అక్షయ నవమి రోజు ఉసిరిక చెట్టును విశేషంగా పూజిస్తారు. ముందుగా ఉసిరి చెట్టు మొదలులో గంగాజలాన్ని సమర్పించాలి. అనంతరం ఉసిరిక చెట్టును గంధ పూస్ఫాక్షతలతో, పసుపు కుంకుమలతో పూజించాలి. ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ‘ఓం ధాత్యే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉసిరిక చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి.