YS Jagan Filed Petition on YS Sharmila and Vijayamma : ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని తెలిసింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో వివాదాలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలో షేర్ బదిలీలపై ఆయన హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిల షేర్లు ఉన్న సరస్వతీ పవర్ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్‌లో కోరారు.
ఎన్నికల అఫిడవిట్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆయనకు షేర్లు ఉన్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో జగన్కు, షర్మిలకు మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం సరస్వతి కంపెనీలో వైఎస్ విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించినట్లు, కొన్ని కారణాలతో ఆ షేర్ల కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్ దాఖలు చేశారు.