Digital Data Protection Draft Guidelines : 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదాలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పొందుపర్చింది. ఈ మేరకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
ఫిబ్రవరి 18 వరకు సలహాలు స్వీకరణ
MyGov పోర్టల్ ద్వారా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా నిబంధనలపై ప్రజాభిప్రాయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కోరింది. ఈ ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలుంటే mygov.inలో తెలియజేయాలని సూచించింది. ఫిబ్రవరి 18 వరకు సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపింది. ఆ తర్వాత ప్రజలు, పలు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
కేంద్ర మంత్రి ట్వీట్
ఈ క్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "డ్రాఫ్ట్ డిజిటల్ ప్రొటెక్షన్ డేటా బిల్లు నియమాలను సంప్రదింపుల కోసం విడుదల చేస్తున్నాం. దీనిపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలి" అని పేర్కొన్నారు.
These draft rules will be finalised only after extensive consultation. Please do share your views. https://t.co/cDtyw7lXDN https://t.co/jFswvJ3sl0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2025
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023లోని సెక్షన్ 40 (1), (2)లో పొందుపర్చిన అధికారాలను వినియోగించుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముసాయిదాను రూపొందించినట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అలాగే డేటా ప్రొటెక్షన్ బోర్డ్‌ను రెగ్యులేటరీ బాడీగా ఏర్పాటు చేయాలని కూడా నిబంధనలు ప్రతిపాదించాయి.
నోటిఫికేషన్లో ఇలా?
"డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఛైర్పర్సన్ పదవికి అభ్యర్థులను ఖరారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ, ఐటీ సెక్రటరీ, ఇతర నిపుణులు నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీ ఇతర బోర్డు సభ్యులను సిఫార్సు చేస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. సభ్యులను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది" అని నోటిఫికేషన్లో పేర్కొంది.
ముసాయిదాలో ఏమున్నాయంటే?
వ్యక్తులకు డేటా విశ్వసనీయత ద్వారా నోటీసు, సమ్మతి నిర్వాహకుని నమోదు, బాధ్యతలు, పిల్లల వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ మొదలైన వాటితో సహా చట్టంలోని వివిధ నిబంధనలను విడుదల చేశారు. డేటా ప్రొటెక్షన్ బోర్డు ఏర్పాటు, ఛైర్పర్సన్, బోర్డులోని ఇతర సభ్యుల నియామకం, సేవా షరతులకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు.