Secunderabad Lok Sabha Constituency : రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రేటర్ పరిధిలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీలు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు ఓటర్లు మాత్రం ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై ఒకెత్తు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీజేపీ, ఒక్కసారైన గులాబీ జెండా సికింద్రాబాద్లో ఎగురవేయాలని బీఆర్ఎస్, ఈసారి కచ్చితంగా సీటును హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి.
విభిన్న మతాలు, వర్గాలకు వేదికైన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని మినీ భారతదేశంగా పిలుస్తారు. ఎందుకంటే బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఎస్సీలతో పాటు ఉత్తరాదికి చెందిన భారతీయ ఓటర్లు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఉండడం ఇక్కడ ప్రధానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లాలాగూడ వర్క్ షాపు, రైల్వే క్వార్టర్లు ఉండడంతో ఎక్కువ మంది రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. దీంతో రైల్వే ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు :కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, మోదీ హ్యాట్రిక్ ప్రధాని అవుతారని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీని గెలిపిస్తే కేంద్ర నిధులతో నియోజకవర్గాలన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలు ఇండియా కూటమే అధికారంలోకి రాబోతుందని వారితోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. విభజన హామీలపై పోరాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్నే అంటూ ప్రచారంతో హోరెత్తిస్తుంది. కానీ ఓటర్లు మాత్రం మౌనం వహిస్తున్నారు. మరి ఈసారి సైలెంట్ ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందని ప్రధాన పార్టీలు ఆలోచనలో పడ్డాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు బీఆర్ఎస్దే : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ ఎన్నికల పర్వం : 1957లో ఏర్పాటైన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 10 సార్లు కాంగ్రెస్ గెలవగా, ఐదుసార్లు బీజేపీ, ఒకసారి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) మాత్రమే విజయం సాధించింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి గెలుపొందారు. ఈసారి మళ్లీ గెలిచి తన సీటు సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కిషన్రెడ్డి పాదయాత్ర, ఒక విడత ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాలు మోదీ హవా పనిచేస్తుందని కిషన్రెడ్డి భావిస్తున్నారు.