Union Minister Bandi Sanjay Visit Rajanna Sircilla District : అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జన్వాడ ఫాంహౌస్‌ను ఎందుకు కూల్చడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో స్థానిక బీజేపీ నేతలను పరామర్శించేందుకు బండి సంజయ్ అక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సురభి టీ సెంటర్లో ఛాయ్ తాగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, తమ భవనాలపై చెయ్యేస్తే ప్రభుత్వం అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇతర విద్యాసంస్థలకు నోటీసులిస్తూ కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలకు నోటీసులెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. సిరిసిల్లలో నేత కార్మికుల కరెంటు బిల్లుల సబ్సిడీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దారుణంగా మోసం చేసిందన్నారు. 50 శాతం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఈ మోసాల్లో ఒకరికొకరు మించిపోయారని, బిల్లులు తడిసి మోపడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి : నేతన్నలు బిల్లులు కట్టడానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. అసలే అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే లక్షల కొద్దీ బిల్లులు వస్తుంటే కట్టేదెలా అని ఇది చాలా సీరియస్ అంశమని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని తెలిపారు. తిట్లు, విమర్శలను పక్కనపెట్టి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని మాటిచ్చారు. నేతన్నలను ఆదుకోవడానికి కేంద్రం తరఫున కృషి చేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.