Railway Board Educational Qualification Level 1 Posts : నిరుద్యోగులకు రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. లెవెల్-1 పోస్టులకు కనీస విద్యార్హత నిబంధనలను సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం, 10వ తరగతి పాసైన వారు కూడా లెవెల్-1 (గ్రూప్ డీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా ఐటీఐ డిప్లొమా లేదా దానికి సమానమైన సర్టిఫికేట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ -NCVT మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ -NAC కలిగి ఉన్నవారూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అంతకుముందు టెక్నికల్ డిపార్ట్మెంట్లలో పనిచేయాలంటే కచ్చితంగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి, NAC లేదా ITI డిప్లొమా కలిగి ఉండాలని నిబంధనలు ఉండేవి. ఈ మేరకు పాత నిబంధనలను రద్దు చేస్తూ రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని రైల్వే జోన్లకు రాతపూర్వకంగా సమాచారం అందించింది.
లెవెల్-1లో వివిధ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లు, పాయింట్స్‌మెన్, ట్రాక్ మెయింటెనర్స్ వంటి పోస్టులు ఉంటాయి. కాగా, 32000 లెవెల్-1 పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరుగనుంది. దీనికి కూడా తాజాగా సడలించిన నిబంధనలు వర్తిస్తాయి.
ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (2025 జనవరి 7 నాటికి) 18-36 ఏళ్లు మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్‌తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం రూ.18,000 వరకు ఉంటుంది.