BRS Leaders Kept Under House Arrest : రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. ఇవాళ అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఈ భేటీకి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కూడా హాజరవుతారని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, శంభీపూర్ రాజులతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.
హరీశ్‌రావు ఇంటి వద్ద ఉద్రిక్తత :కోకాపేటలోని మాజీమంత్రి హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి ముందు బారికేట్లు ఏర్పాటు చేసి హరీశ్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు భుజానికి గాయమైందని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవితలను పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం పోలీసుల తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్‌రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే పోలీసులు అనుమతించలేదు.
బీఆర్‌ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలి : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన గాంధీ, వారి అనుచరులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.