Congress Ministers in charges Lok Sabha Constituency : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మిషన్-15 లక్ష్యంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహరచనను అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకొంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కొందరు మంత్రులకు పరీక్షగా మారింది.
TS Lok Sabha Elections Challenge to Ministers :మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్‌సభ బాధ్యతను అప్పగించారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. దీంతో ఆమె ఆదిలాబాద్‌పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ప్రకటించిన ఐదు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి చెబుతున్నారు.
Congress Leaders Election Campaign :మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్‌సభ సీటు బాధ్యతలను అప్పగించారు. ఈ నియోజకవర్గ పరిధిలోనూ మెదక్ సెగ్మెంట్లో మాత్రమే పార్టీ గెలిచింది. ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా, పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డికే టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది. గ్యారంటీల అమలు, అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.