Telangana Lok Sabha 2024 Nominations : లోక్‌సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టానికి ముహూర్తం సమీపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ పర్వాన్ని అట్టహాసంగా నిర్వహించేలా రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్(Election Notification in TS) వెలువడనుంది. అదే రోజునే నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్పటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగనుంది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ గడువు ఉండనుంది. 25 వరకు గడువు ఉన్నాసరే ఎక్కువ మంది తొలి రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆరోజులు మంచివిగా భావిస్తుంటారు.
అయితే ఈసారి మాత్రం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నామినేషన్లు ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న అతి ప్రధానమైన ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈ కార్యక్రమాన్ని జనాలను ఆకట్టుకునేలా నిర్వహించాలని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
Lok Sabha Election 2024 Nominations :కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం 17 స్థానాలకు(Lok Sabha Election 2024) అభ్యర్థులను బరిలోకి నిలిపారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు ఇప్పటికే పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాల అభ్యర్థులను వెల్లడించనున్నారు. మిగిలిన బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎలాంటి గందరగోళం లేకుండా నామినేషన్ల ప్రక్రియ జరగాలని పార్టీలు భావిస్తున్నాయి.
కారు జస్ట్ సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలో జెట్ స్పీడ్‌లో దూసుకొస్తుంది : కేటీఆర్
నామినేషన్లకు సీఎం, మంత్రులు, కేటీఆర్, హరీశ్ : కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. భువనగిరి, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Paricipate Nominations) పాల్గొననున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్, హరీశ్‌రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారని నేతలు తెలిపారు.
బీజేపీ రాష్ట్రాల సీఎంలు లేదా కేంద్రమంత్రులు :రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల అంశాన్ని జాతీయ పార్టీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమాలలో ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లేదా కేంద్రమంత్రి ఒకరు స్వయంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 17 లోక్‌సభ అభ్యర్థుల కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటారనే అంశంపై మరో రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి కీలక నేతలు హాజరుకానున్నారు.
కీలక నేతలు సిద్ధం : ఈనెల 19వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. పార్టీ ముఖ్యనేతలైన ఈటల రాజేందర్, డీకే అరుణ 18న, ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి 19వ తేదీన, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 24వ తేదీన, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 22న నామినేషన్లు వేయనున్నారు. బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్‌కుమార్ 20వ తేదీన నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
ఎన్నికల ప్రచారానికి కోట్లలో ఖర్చు - పైసలిస్తేనే ప్రచారానికి వస్తామంటున్న స్థానిక నేతలు
లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా ఆదిలాబాద్ రాజకీయం - గెలుపు గుర్రం కోసం అన్వేషణ