Telangana Congress Strategy on MP Elections :రాష్ట్రంలో నాలుగు విడతల్లో 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, మరో మూడింటికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా కూడా ప్రచారంపై దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను, సీనియర్ నాయకులను ఇంఛార్జ్‌లుగా నియమించిన రాష్ట్ర నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో కదలికలు తీసుకొచ్చే దిశలో ముందుకు వెళ్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లుగా నియమితులైన మంత్రులు, సీనియర్ నేతలు, ఆయా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Lok Sabha Elections 2024 :నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలను అంచనా వేసే దిశలో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులతో ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థులతో సమీక్ష నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్(BRS) నేతల బలాబలాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని, హస్తం పార్టీ తమ ఖాతాలో వేసుకునేందుకు చురుకైన పాత్ర పోషిస్తూ చొరవ చూపుతోంది.
Telangana Congress MP Candidates 2024 :ఏఐసీసీ(AICC) రూపకల్పన చేసిన మేనిఫెస్టోతో పాటు గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, పరిమితికి మించి చేసిన అప్పులు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తీరును గడపగడపకు తీసుకెళ్లి, బీఆర్ఎస్ వైఖరిని ఎండకట్టేలా యోచిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ పరంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల వద్దకు తీకుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం అవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు సమీక్ష నిర్వహించుకుని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో చర్యలు చేపట్టనున్నారు.
తుక్కుగూడలో భారీ బహిరంగ సభ :ఏఐసీసీ కీలకంగా భావిస్తున్న పాంచ్ న్యాయ గ్యారంటీలకు విస్తృతమైన ప్రచారం కల్పించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తుంది. కాంగ్రెస్ చెప్పింది చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేట్లు పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎంరేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికే పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. గత సెప్టెంబర్ 17న నగర శివారు తుక్కుగూడ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆరు హామీలను హస్తం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) చేతుల మీదుగా ప్రకటన చేయించారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సెంటిమెంట్‌తో తిరిగి అక్కడనే ఈనెల ఆరో తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.