Congress Analysis of Lost Seats in Parliament Elections : రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్, లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పోరాడింది. ఫలితాల్లో మాత్రం 8స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలు దక్కలేదనే అంతర్మథనం కాంగ్రెస్‌లో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా? కొందరు మంత్రులు పూర్తి స్థాయిలో పని చేయలేదా? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ లోపాయికారీగా సహకరించిందా? అని ఆ పార్టీ నేతలు కారణాలను విశ్లేషిస్తున్నారు.
అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం : లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. బలమైన నాయకులు లేక, ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది.
బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను, సికింద్రాబాద్ బరిలో దించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ కోరడం, ఇందుకు దానం ససేమిరా అనడంతో ప్రచారంలో కాలయాపన జరిగింది. పోటీ చేయాలా? వద్దా? అనే డైలమాలో ఉన్న దానం నాగేందర్ ప్రచారంలో వెనుకబడ్డారని భావిస్తున్నారు.
Telangana Congress Strategy on Parliament Election : మల్కాజిగిరి అభ్యర్ధిగా వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించింది. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, హస్తం పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. బీజేపీ నుంచి రాష్ట్ర స్థాయిలో పేరున్న ఈటల రాజేందర్ ప్రత్యర్థిగా ఉండటంతో బలంగా ఎదర్కొనలేకపోయామని కాంగ్రెస్ భావిస్తోంది. సునీతా మహేందర్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయించి ఉంటే, అక్కడ సునాయాసంగా గెలిచి ఉండేవాళ్లమని విశ్లేషిస్తున్నారు.
చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచి, కమలం అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో హోరాహోరీ తలబడ్డారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్‌రెడ్డి, గెలుపు వాకిట తడబడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ పట్టుబట్టి, మెదక్ టిక్కెట్ నీలం మధుకు ఇప్పించారు. త్రికోణ పోరులో మెదక్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకోవాల్సి వచ్చింది.