Congress Leaders Comments On KCR: ప్రభుత్వ పాలనపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక పోతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వంపై అసహనంతోనే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఎవరైనా ఏడాదిగా ఫాంహౌస్‌లో ఉంటారా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ కోసమే బయటకొచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఒక సీజనల్ రాజకీయవేత్త అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తిరిగి అధికారంలోకి వస్తారని కేసీఆర్ పగటికలలు కంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ తన భవిష్యత్తు :14 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా కనబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ తన భవిష్యత్తు, పార్టీ భవిష్యత్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రజలు కర్రు కాల్చివాత పెట్టిన విషయం మరిచిపోయి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సిల్వర్ జూబ్లీ మీద ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్‌ను ముంచింది : బీజేపీతో రాజకీయ ఒప్పందమే బీఆర్ఎస్‌ను ముంచిందని, భవిష్యత్‌లో ముంచబోతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ జోస్యం చెప్పారు. కేసీఆర్, బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మునిగిపోతున్న బీఆర్ఎస్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఫాంహౌస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్నాడని మండిపడ్డారు.