Telangana Assembly Sessions 2024 : అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వం రెండు బిల్లుల్ని సభలో ప్రవేశ పెట్టనుంది. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నేడు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 9న వాయిదా పడగా, ఇవాళ్టి నుంచి మళ్లీ మొదలు కానున్నాయి. తొమ్మిదో తేదీన సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ చేపట్టింది. ఆరోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి ఉన్న టీ షర్టులు వేసుకుని రావడంతో అసెంబ్లీలోకి రానీకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు! - నేడు సభ ముందుకు 2 కీలక బిల్లులు - TELANGANA ASSEMBLY SESSIONS 2024
ఇవాళ తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు - రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం - పర్యాటక విధానంపై నేడు సభలో స్వల్పకాలిక చర్చ - అసెంబ్లీ పనిదినాలపై బీఏసీ భేటీలో నిర్ణయం
Published : Dec 16, 2024, 6:36 AM IST
కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్యనే తెలంగాణ తల్లిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఆ తర్వాత ఇవాళ్టికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వారం తర్వాత పునర్ ప్రారంభమవుతున్న సమావేశాలు ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నేడు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ మొదలు కాగానే గంటపాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి దేవి, ఊకె అబ్బయ్య, రామచంద్రారెడ్డికి సంతాపం ప్రకటిస్తారు.
పర్యాటక విధానంపై చర్చ : అనంతరం శాసనసభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ శాఖలను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. రాష్ట్రంలో ఆకర్షనీయమైన స్థలాలు, ఆలయాలు ఉన్నాయి. అయినా ఆశించిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ఇటీవల సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి కొత్త పర్యాటక పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.