TDP Politburo Meeting: వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్దరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో జిల్లాల పునర్విభజనపై చర్చించారు. నాలుగున్నర గంటలపాటు భేటీ సాగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని నిర్ణయించారు.
కడపలో టీడీపీ మహానాడు: ఈసారి తెలుగుదేశం మహానాడు కడపలో నిర్వహించాలని చర్చ జరిగింది. మహానాడు తర్వాత పార్టీ రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్ సున్నా అయిందని చంద్రబాబు విమర్శించారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లటంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
3 విడతల్లో అన్నదాత-సుఖీభవ: 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని తేల్చిచెప్పారు. తల్లికి వందనం, అన్నదాత-సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవకి కేంద్రం 6 వేల రూపాయలు ఇచ్చినా మిగిలిన 14 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20 వేలు చెల్లిద్దామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పీపీపీ మోడల్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం:బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50 శాతం నిధుల్లో సగమైనా కేంద్రాన్ని అడగాలని ముఖ్యమంత్రి నేతలతో చెప్పారు.
పద్మ అవార్డులు పొందిన తెలుగువారికి అభినందనలు: అదే విధంగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారికి అభినందనలు పొలిట్ బ్యూరో తెలిపింది. బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించటం పట్ల సభ్యులు అభినందనలు తెలిపారు. టీడీపీ సభ్యత్వాలు కోటి దాటడం పట్ల లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడిన సీఎంకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది.