YSRCP Leader Peddireddy Warning to TDP Activists: వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ తడాఖా ఏంటో టీడీపీ నేతలు, కార్యకర్తలకు చూపిస్తామని అన్నారు. కడప జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
జగన్ అండగా ఉంటారు: గ్రామస్థాయిలో కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ఇబ్బందులు పెడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. తమపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇకనుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటానని పెద్దిరెడ్డి అన్నారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలో జగన్ విస్తృతంగా పర్యటించి భరోసా ఇస్తారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు, దాడులను ధైర్యంగా ఎదుర్కొందామని పార్టీ కార్యకర్తలకు పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామస్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు కచ్చితంగా ఉంటాయి. మా తడాఖా ఏందో జగన్ సీఎం అయ్యాక వారికి రుచి చూపిస్తాం. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని జగన్ చెప్పారు. జగన్ ఆదేశాలను అందరూ పాటించాలి. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు.- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేత
పెద్దిరెడ్డి భూ దోపిడీ నిజమే - వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోకి మంగళంపేట భూములు
అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం-చూసేద్దామా?