Chandrababu Comments on AP Election Results 2024 : తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉందని, ఇప్పటికే కూటమి నేతలు బాబును సంప్రదించారన్న వార్తలకు చెక్ పెడుతూ చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కూటమి ఘనవిజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి చంద్రబాబు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతోనే పని చేశామన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లామని అన్నారు. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరులోని ఉండవల్లి తన నివాసంలో టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడారు.
'నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం టీడీపీకి, 39.37 శాతం వైఎస్సాఆర్సీపీకు వచ్చాయి. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది. ఐదేళ్లు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారు. కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితి. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని' టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
AP Election Results 2024 :ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పని చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓట్లు వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది అని హర్షించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలని అన్నారు.
అవినీతి, అరాచకాలతో పని చేస్తే ఇలాంటి గతే పడుతుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లు తమ కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారని, కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారని, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన పరిస్థితి చూశానని ఆవేదన చెందారు. కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు.