NOTA in Local Body Elections :రానున్న సర్పంచి ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓటు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు రెండో సారి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది. ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పరిగణించి ఓటింగ్ పెట్టాలని యోచిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చలేదన్న అభిప్రాయన్ని తెలిపే స్వేచ్ఛ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ప్రవేశపెడుతూ 2016, 2018, 2019లో రాష్ట్రంలో నిబంధనలు సవరించారు. అయితే ఒకవేళ నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్నికైనట్లు ప్రకటించాలనే ప్రస్తుత నిబంధన. ఒకే నామినేషన్ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో పరిగణించి :ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కొన్ని చోట్ల బలప్రయోగాలు, ప్రలోభాలు జరుగుతున్నాయని నోటాతో ఎన్నిక పెట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి ఎన్జీవోలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, దిల్లీ, హరియాణా విధానాలను పరిశీలించింది.
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన : ఆ మూడు రాష్ట్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన అమల్లో ఉంది. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం మళ్లీ ఎన్నిక నిర్వహించకుండా రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించేలా అక్కడి రూల్స్ ఉన్నాయి. హరియాణాలో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహిచడంతో పాటు మొదటి సారి పోటీలో ఉన్నవారు తిరిగి పోటీ చేయరాదనే నిబంధన ఉంది.
రానున్న సర్పంచి ఎన్నికల్లో హరియాణా మోడల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు గతేడాది నవంబరులో రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపింది. అభిప్రాయాలు, సూచనలు పంపించాలని రాజకీయ పార్టీలను కోరగా సీపీఎం మినహా మిగతా పార్టీలు స్పందించలేదు. త్వరలో సర్పంచి ఎన్నికలు జరగనున్నందున ఈ అంశంపై చర్చించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.