Seetharama Project Motor Trail Run Successful : సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్‌హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని సూమారు 9 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్‌ను బుధవారం అర్ధరాత్రి చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుస రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు సంబరాల్లో మునిగితేలారు.
ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయ్యిందంటూ నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన ఆయన అక్కడికి చేరుకున్నారు. ట్రయల్ రన్‌పై అధికారులను వివరాలు అడిగి తెలసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు దగ్గర వచ్చిన ఆయన నీటిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. నీరు పారుతున్న పుడమికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో అధికారులకు అభినందనలు తెలిపారు.
సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి తుమ్మల
అనంతరం మాట్లాడిన ఆయన ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు చెప్పారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా భూముల్ని తడిపే కీలక ఘట్టం ఆవిష్కృతం కావడం తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనన్నారు. ఖమ్మం జిల్లా సాగుకు గోదావరి జలాలు అందించాలనేది తన జీవిత, రాజకీయ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సీతారామ ద్వారా తొలి దఫాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
"నా రాజకీయ ఆకాంక్ష, ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా భూములకు తరలాలని నా ప్రయత్నం వరక చేసుకుంటూ వస్తున్నాను. ఎంతో మంది కృషి ఫలితంగా భూములు ఇచ్చిన అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు అందరికీ కూడా నా పాదాభివందనాలు. రేవంత్ రెడ్డి హయాంలో మొట్టమొదటి సారిగా ఈ పంట కాలంలోనే లక్షన్నర ఎకరాలకు నీళ్లివ్వాలని అనుకున్నాం." - తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి
KTR Tweet On Seetharama Project : ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదని, దశాబ్దాల పాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో స్వప్నం సాకారమైన క్షణమిది అన్నారు. కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజు ఇది అని పేర్కొన్నారు. " సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ" అని కేసీఆర్ ఆనాడే ప్రకటించారని ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే వరప్రదాయినికి ప్రాణం పోశారని తెలిపారు.
ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించారని, పటిష్ట ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పది లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారని పేర్కొన్నారు. కాలమైనా, కాకపోయినా, పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కలను సాకారం చేసి ఈ "జలవిజయం"లో భాగస్వాములైన నీటిపారుదల అధికారులు, సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.
సీఎం అంటే కట్టింగ్ మాస్టర్ కాదు - కరెక్టింగ్ మాస్టర్ - కేటీఆర్ ట్వీట్‌కు మంత్రి కౌంటర్
రాష్ట్రంలో విత్తన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి : మంత్రి తుమ్మల - Minister thummala On Seeds