Parliament Elections Nominations in Telangana : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు రెండో రోజు నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు పదిహేను పార్లమెంటు స్థానాల్లో 57 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 57 మంది అభ్యర్థుల నుంచి 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రెండ్రోజుల్లో మొత్తం 98 మంది అభ్యర్థులు 117 నామినేషన్లు దాఖలు చేశారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూలు, ఖమ్మంలో ఒక్కొక్కరు. హైదరాబాద్‌లో ఇద్దరు, పెద్దపల్లి, చేవెళ్ల, వరంగల్‌లో ముగ్గురు. మెదక్, నల్గొండ, మహబూబాబాద్‌లో నలుగురు. మల్కాజిగిరి, భువనగిరిలో అయిదుగురు కాగా నిజామాబాద్, సికింద్రాబాద్‌లో ఆరుగురు చొప్పున నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు మల్కాజిగిరిలో అత్యధికంగా 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
NO Nomination in Cantonment :ఉపఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వంశీచంద్ ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మురళినాయక్, రాంచంద్రునాయక్ సహా పలువురు పాల్గొన్నారు. అంతకుముందు బలరాంనాయక్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
BJP MP Candidate Kishan Reddy Nomination : సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నాలుగు సెట్ల నామినేషనన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు వెళ్లిన పసుపు రైతులు, అర్వింద్‌కు నామినేషన్ డిపాజిట్ ఫీజు అందించారు.