Robert Vadra Visit Temples in Hyderabad : తన భార్య ప్రియాంక గాంధీ, కుమార్తె భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళనగా అనిపిస్తోందని రాబర్ట్ వాద్ర తెలిపారు. ముఖ్యంగా దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్చుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో ప్రముఖ దేవాలయాల సందర్శనకు ఆయన విచ్చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారు.
మహిళలు తమకు భద్రత ఉందని భావించే రోజు రావాలని తాను ఆశిస్తున్నట్లు రాబర్ట్ వాద్రా తెలిపారు. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లోనే నేర్పాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ, తాను ఒకే విషయాన్ని మాట్లాడుతున్నామని, దేశంలోని సమస్యలను తాను, రాహుల్ ఒకే కోణంలో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన మరో ఐదేళ్ల తర్వాత ఆ మార్పునకు ప్రజలు మద్దతుగా నిలుస్తారన్నారు. తాను ఆధ్యాత్మిక భావనతోనే దేశవ్యాప్తంగా తిరుగుతున్నట్లు పేర్కొన్న ఆయన హైదరాబాద్ వచ్చి పలు ఆలయాలను సందర్శించినట్లు వివరించారు. ఆలయాల చరిత్ర తెలుసుకోవడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
కంగనా రనౌత్ స్పందించాలి : మూడు రోజులపాటు ఇక్కడ ఉంటానన్న వాద్రా బీజేపీ మహిళ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఒక మహిళ ఎంపీగా మహిళల భద్రత గురించి ఆమె మాట్లాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందన్న ఆయన తన పర్యటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్న ఆయన ఆమె విజయం తద్యమని దీమా వ్యక్తం చేశారు. కోల్కతా ఘటనలో న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.