CM Revanth Reddy Focus on Telangana Cabinet Expansion :గతేడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వేచి చూసే ధోరణలో ముందుకు వెళుతున్నారు. ఏఐసీసీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి ముందుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. కీలకమైన హోం శాఖ, విద్యా శాఖ, మున్సిపల్, కార్మిక శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగియడంతో సీఎం పాలనపై దృష్టి సారించారు.
మంత్రిమండలి విస్తరణపై సీఎం కసరత్తు :ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో తలమునకలైన సీఎం, మంత్రుల నియామకాల అంశంపైనా దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిపై కొందరు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మార్పులు చేర్పులు చెయ్యాలన్న యోచనతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 37 నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిని తొలిగించాల్సి వస్తే, వాటి స్థానంలో పార్టీ కోసం కస్టపడి పని చేసిన, చేస్తున్న వారిని చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అది కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
Revanth Govt Focus On Cabinet Expansion :ఇక మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇప్పటికే అధిష్ఠానం వద్ద కూడా మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరుగురు మంత్రులను విస్తరణలో భర్తీ చేయాల్సి ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం చాంతాడంత ఉంది. కానీ 6 మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడీకి, మరొకటి మైనారిటీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన హోం శాఖను బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న ఆశావహులు :ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ హామీతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఎవరికి వారు దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే పోటీ పడుతున్న నలుగురు రెడ్డి సామాజికవర్గ నాయకుల్లో ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది.