BJP Leaders Reacts on Election Results 2024 : రాష్ట్రంలో బీజేపీ గాలి వీచింది. గత లోక్సభ ఎన్నికల్లో కంటే, ఈసారి మరిన్ని సీట్లను సాధించి అందరి అంచనాలను తలకిందులు చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం పట్ల బీజేపీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజిగిరి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మల్కాజిగిరి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, పార్లమెంట్ స్థానం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను వమ్ము చేయకుండా అమలు చేస్తానని తెలిపారు. తన విజయంలో అన్నివర్గాల ప్రజలు, కార్యకర్తలు మద్దతిచ్చారని, ఎంపీగా ఎన్నికైన తర్వాత అందరివాడిగా ఉంటానని స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత కూడా మోదీని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించారన్నారు.
ప్రజలు, మోదీ ఆశీర్వాదంతో విజయం సాధించానని బీజేపీ నేత డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్నగర్ స్థానం నుంచి తనను గెలుపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల వంటి వాటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన విజయంలో అన్నివర్గాల ప్రజలు, కార్యకర్తల కృషి మరవలేనిదన్నారు.