Rahul Gandhi Comments on Phone Tapping Case : గత సీఎం ఎలా పనిచేశారో మీకందరికీ తెలుసు, ఆయన వేలాది ఫోన్లు ట్యాప్(Phone Tapping) చేయించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత సీఎం రెవెన్యూ, ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేశారని అన్నారు. ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా మూసీ నదిలో పడేశారని ధ్వజమెత్తారు. వ్యాపారులను బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అప్పుడు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిందే కేంద్రంలో ప్రధాని మోదీ(PM Modi) చేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాహుల్ గాంధీ అనంతరం మాట్లాడారు.
మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీలు ఉన్నాయని, ఎక్కడికైనా మోదీ వచ్చేముందే ఈడీ వస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. కంపెనీలను ముందు సీబీఐ, ఈడీ బెదిరిస్తుందని చెప్పారు. ఈడీ, సీబీఐ రాగానే ఆ కంపెనీ బీజేపీ బాండ్లు(Election Bonds Issue) కొంటుందని వివరించారు. మోదీ కేవలం 3 శాతం మంది ధనికుల కోసం మాత్రమే పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలనూ కూడా స్తంభింపజేశారని ఆవేదన చెందారు.
కాంగ్రెస్‌కు సెంటిమెంట్‌గా మారిన తుక్కుగూడ - పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా జనజాతర
Congress Jana Jatara Sabha at Tukkuguda : దేశంలోనే బీజేపీ అతిపెద్ద వాషింగ్ మెషీన్‌గా మారిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలోని అవినీతి పరులంతా మోదీ పక్కనే చేరారని దుయ్యబట్టారు. ఈసీ(Central Election Commission)లోనూ మోదీ మనుషులు ఉన్నారని, ఎలక్టోరల్ బాండ్ల పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో మీకే అర్థమవుతోందని వివరించారు.