Political situation in Godavari Districts :ఆంధ్రప్రదేశ్లోనిఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పదిమందిని కదిలిస్తే ఏడుగురు తమ ఇబ్బందులు చెబుతున్నారు. సామాన్యులు, పేదలు కూడా ధరల పెరుగుదలతో కష్టపడుతున్నామని వివరించారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధి మంగళ, బుధవారాల్లో ఈ రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు.
People Against to YSRCP : ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా నిడదవోలు చేరారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి రావులపాలెం, అంబాజీపేట, రాజోలు, చించినాడ వంతెన, పొదలాడ, తాటిపాక మీదుగా అంబాజీపేట, అమలాపురం వరకు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలతో చర్చించిన తరువాత వైసీపీ ప్రభుత్వంపై (People Against to YSRCP)వస్తున్న వ్యతిరేకతపై ప్రత్యేక కథనం.
AP Elections 2024 :ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎవరూ నిరాకరించలేదు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తీ స్పందించారు. కాకపోతే ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు’ అని ఎదురు ప్రశ్నించారు. వ్యక్తిగత పని మీద ఇలా వచ్చామని, ఆసక్తి కొద్దీ అడుగుతున్నామని చెప్పి వారి అభిప్రాయాలు సేకరించగా చాలా స్వేచ్ఛగా మనసులో మాట చెప్పారు. ప్రభుత్వంపై మీ అభిప్రాయాలేంటి, మీ ప్రాంతంలో ఏమనుకుంటున్నారని ఎదురు ప్రశ్నించి ఆసక్తిగా విన్నారు.
మందుబాబుల్లో ఆగ్రహం :మందుబాబులు ప్రస్తుత పరిస్థితులపై కోపంగా ఉన్నారు. అమలాపురం సెంటర్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి ఎదురయ్యారు. ‘గతంలో క్వార్టర్ బాటిల్ రూ.50కే కొనేవాళ్లమని వెల్లడించారు. కిక్కు ఉండేదని, ఇప్పుడు ధర పెరిగిందని అయితే, ఎంత తాగినా కిక్కే లేదని ఆరోపించాడు. బటన్లు నొక్కి డబ్బులిచ్చినా అన్నీ ఇలాగే ఖర్చయిపోతున్నాయని వాపోయాడు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని వ్యాఖ్యానించాడు. పదిమందిలో ముగ్గురు, నలుగురు ఇళ్ల స్థలాలు వచ్చాయని, పింఛన్లు వస్తున్నాయని, పథకాల సొమ్ములు వస్తున్నాయని సానుకూలంగా స్పందించారు. పనిలో పనిగా ధరలు ఇబ్బందులు పెడుతున్నాయని, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజకీయ పరిణామాలనూ గుర్తిస్తూ: అమలాపురం, అంబాజీపేట జనగళం సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇద్దరూ ఓటు బదిలీ గురించి విజ్ఞప్తి చేశారు. గాజుగ్లాసు లేనిచోట సైకిల్, కమలం గుర్తులకు, సైకిల్ లేని చోట గాజుగ్లాసు, కమలం గుర్తుకు ఓటు వేయాలని ఇద్దరూ ప్రజలను కోరారు. చాలాచోట్ల ప్రజలు ‘కూటమి’ అని ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయన్న భావన ప్రజల్లో ఏర్పడింది.