చేవెళ్లలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీల పోటీ Chevella Lok Sabha Election Fight 2024 : రాష్ట్ర రాజధానిని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. త్రిముఖ పోటీలో పార్టీల కంటే బరిలో నిలిచిన అభ్యర్థులే ఓటర్లలో ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డి హస్తం పార్టీ నుంచి, గడ్డం రంజిత్‌రెడ్డి భారత్ రాష్ట్ర సమితి నుంచి పోటీ పడగా, విశ్వేశ్వర్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.
ఈసారి పోటీదారులు మారలేదు కానీ వారు పోటీ చేస్తున్న పార్టీలు మారాయి. రెండోసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగి కత్తులు దూసుకుంటున్నారు. వీరిద్దరికి గట్టి పోటీతో పాటు సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్ బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను రంగంలోకి దింపింది. మూడు పార్టీలు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గులాబీ పార్టీ బీసీ నినాదం, హస్తం పార్టీ అభివృద్ధి మంత్రం, బీజేపీ మోదీ గ్యారంటీతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.
గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్న కాంగ్రెస్ : 2009లో చేవెళ్ల పార్లమెంటు దక్కించుకున్న కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ప్రభావాన్ని చూపించలేకపోయింది. 2014లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతితో చేవెళ్ల సీటు గులాబీ పార్టీ పరమైంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఐదేళ్లు భారత్ రాష్ట్ర సమితి ఎంపీగా పనిచేసి 2019 ఎన్నికల ముంగిట హస్తం పార్టీలో చేరి ఆ పోరులో ఓటమి పాలయ్యారు. ఈ సారి చేవెళ్లలో పాగా వేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డి పార్టీలో చేర్చుకుని గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
తెలంగాణలోనే ధనిక అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి రికార్డ్! - ఆస్తుల విలువ అక్షరాలా రూ.4,490 కోట్లు - Telangana Richest MP Candidate
Lok Sabha Elections 2024 :చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో ఎమ్మెల్యేల సమన్వయంతో రంజిత్‌రెడ్డి ఓటర్లను తనవైపు తిప్పుకుంటున్నారు. అయితే ఆయనకు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించడం లేదని వినిపిస్తోంది. సొంత పార్టీలోనే రెండు వర్గాల మధ్య విబేధాలు, రంజిత్‌రెడ్డి గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉందని స్థానిక నేతలు భావిస్తున్నారు.
సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ : ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని చేజారిపోకుండా జాగ్రత్తపడుతోంది. తీగల కృష్ణారెడ్డి, సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీ మారారు. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను గులాబీ పార్టీ బరిలో దింపింది. వరుసగా రెండుసార్లు గెలిచిన భారత్ రాష్ట్ర సమితి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించి పనిచేస్తున్నారు. తొలిసారి బీసీలకు టికెట్ ఇచ్చామని ప్రజల్లోకి వెళ్తోంది. ముదిరాజ్ వర్గం ఓట్లు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. రంజిత్‌రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న హస్తం పార్టీ వర్గమంతా తమకు సహకరించే అవకాశాలు లేకపోలేదని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రచారంలో దూకుడు పెంచిన విశ్వేశ్వర్‌రెడ్డి : ఓడిపోయిన చోటే గెలుపు రుచి చూడాలనే తపన, పంతంతో మూడోసారి బీజేపీ తరఫున బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తిరుగుతున్నారు. మోదీ మానియా తనకు కలిసొస్తుందే భావనతో ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామాల్లో గడపగడప చుట్టొచ్చిన ఆయన మోదీ గ్యారంటీలనే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచి ఉనికి కాపాడుకుంది.
చాలా పల్లెల్లో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు, అభ్యర్థుల మార్పు తనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని విశ్వేశ్వర్‌రెడ్డి కొండంత ఆశతో ఉన్నారు. మరోవైపు చేవెళ్ల ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠగా మారింది. ఒకసారి గెలిచిన ఎంపీ మరోసారి నెగ్గిన ఆనవాయితీ లేకపోవడం ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధన బలం ఉంటే, మాకు ప్రజా బలం ఉంది : కాసాని జ్ఞానేశ్వర్ - Lok Sabha Elections 2024
చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని 'హస్త'గతం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు - Lok Sabha Election 2024