PM Modi Election Campaign in Vemulawada : కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, తెర వెనుక మాత్రం అవినీతి సిండికేట్ చేస్తారని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన 'ఎములాడ జన సభ'కు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని అన్నారు.
PM Modi Speech At Vemulawada Public Meeting Today: ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే కలుగుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపినప్పుడే కరీంనగర్లో
ఆ పార్టీ ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్లో మచ్చుకైనా కనిపించట్లేదన్నారు.
"ప్రజల ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చాం. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం. బీజేపీకి దేశమే తొలి ప్రాధాన్యత. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత. కుటుంబం వల్ల, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే నినాదంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయి."- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
PM Modi Slams BRS And Congress :కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, నాణేనీకి బొమ్మ, బొరుసు వంటివని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ రెండూ అవినీతి పార్టీలేనన్న మోదీ వాటిని అవినీతే అనుసంధానం చేస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని రెండు పార్టీలు కాలరాశాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారని కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పని చేసిందని విమర్శించారు. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ కూడా కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేసిందని మండిపడ్డారు.
"వంశపారంపర్య రాజకీయాలతో కాంగ్రెస్ దోపిడీ చేసింది. మాజీ ప్రధాని పీవీని కూడా కాంగ్రెస్ అవమానించింది. పీవీ పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదు. పీవీని భారతరత్నతో సన్మానించింది బీజేపీ. దేశానికి పీవీ చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. పీవీ కుటుంబంలో 3 తరాల సభ్యులను నిన్న కలిశాను. పీవీ గురించి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.