PM Modi On BRS Delhi Liquor Scam :ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల తెలంగాణ గడ్డ అని, కాంగ్రెస్ తెలంగాణ ఆశలను నాశనం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను దోచుకుందని, ఇప్పుడు హస్తం పార్టీ తెలంగాణను తమ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోందన్న ఆయన, ఒక దోపిడీదారు, మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసన్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి అవినీతిపై రేవంత్ సర్కార్ మౌనం వహిస్తోందన్న ప్రధాని, కాళేశ్వరం దోపిడీని కాంగ్రెస్ ప్రశ్నించడం మానేసిందన్నారు.
PM Modi at Jagtial BJP Meeting Today :జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకరినొకరు కాపాడుకుంటూ, బీజేపీని విమర్శిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ 2 పార్టీలు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదన్న ఆయన, దోపిడీదారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. కుటుంబపార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయని ఆరోపించిన ఆయన, దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయని తెలిపారు.
2 జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీనే. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చింది. అదీ కుటుంబ పార్టీనే. ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ చేరింది. కుటుంబ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి కాళేశ్వరంలో అవినీతి చేసింది. దిల్లీ మద్యం అంశంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. తెలంగాణలో బీజేపీని ఎంతగా గెలిపిస్తే, నేను అంతగా బలోపేతం అవుతా. - ప్రధాని మోదీ