తెలంగాణ

telangana

ETV Bharat / politics

మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా అరెస్ట్ చేస్తారా? - పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

లగచర్ల ఘటనలో ఏ1గా కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి - కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను క్వాష్​ చేయాలని హైకోర్టులో పిటిషన్​ - తీర్పు రిజర్వ్​ చేసిన హైకోర్టు

Patnam Narender Reddy Petition
Patnam Narender Reddy Petition (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Patnam Narender Reddy Petition :లగచర్ల దాడి ఘటనలో కింది కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులను క్వాష్‌ చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్​పై వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. పోలీసుల రిమాండ్‌ రిపోర్టును పరిగణలోకి తీసుకున్న కొడంగల్ కోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్ విధించిందని ఈ ఉత్తర్వులను కొట్టి వేయాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్​ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. నరేందర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌ రావు వాదనలు వినిపించారు.

పోలీసులు దాఖలు చేసిన మొదటి రిమాండ్‌ రిపోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పేరు లేదని, నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రెండో రిమాండ్‌ రిపోర్టులో నరేందర్ రెడ్డిని ఏ1గా చేర్చినట్లు పోలీసులు చెబుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అధికారులపై దాడికి కుట్ర పన్నారని, ప్రజలను రెచ్చగొట్టినట్లు నరేందర్ రెడ్డిపై కేసులు నమోదు చేశారని.. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. దాడిలో పాల్గొన్న సమయంలో సురేశ్​తో నరేందర్ రెడ్డి వందల సార్లు ఫోన్ మాట్లాడారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. 71 రోజుల వ్యవధిలో 84సార్లు మాట్లాడినట్లు పోలీసులు ఇచ్చిన నివేదికలోనే ఉందన్నారు.

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ నేత ఆదేశాల మేరకు అలజడి సృష్టించడానికే దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు పేర్కొనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి, సంబంధిత కోర్టుకు అఫిడవిట్‌ కూడా సమర్పించారన్నారు. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేపట్టే విషయాన్ని పట్నం నరేందర్ రెడ్డి బహిరంగంగా వ్యతిరేకించడంతో పాటు.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు.

ఉగ్రవాదిలా అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది : ప్రభుత్వంలో అస్థిరత సృష్టించాలన్నదే నరేందర్ రెడ్డి కుట్ర అని ఆయన వాదించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని.. ఇప్పుడు నరేందర్ రెడ్డి పిటిషన్‌ను అనుమతిస్తే విచారణపై ప్రభావం చూపిస్తుందని పీపీ వాదించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్‌ చేసిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. మాజీ ఎమ్మెల్యేను కేబీఆర్ పార్కు వద్ద ఓ ఉగ్రవాదిలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించింది.

ఆయన ఏమైనా అజ్ఞాతంలోకి వెళ్లాడా అని పీపీని న్యాయమూర్తి అడిగారు. దాడికి గురైన అధికారులకు తగిన గాయాలేమో స్వల్పంగా ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారని పోలీసులేమో తీవ్ర గాయాలుగా పేర్కొంటున్నారని హైకోర్టు తప్పుపట్టింది. లక్ష్మణ్, దేవేందర్, హన్మంత్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా నరేందర్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారని.. ఆ ముగ్గురి వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించాలని పీపీని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.

కొడంగల్​ కోర్టుకు పట్నం నరేందర్​ రెడ్డి : మరోవైపు పట్నం నరేందర్​ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి కస్టడీ పటిషన్​ నిమిత్తం కొడంగల్​ కోర్టుకు తీసుకెళ్లారు. నరేందర్​ రెడ్డిని కొడంగల్​కు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. పట్నంకు మద్దతుగా సీఎం రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్నం సతీమణి సహా కుటుంబ సభ్యులు సైతం ఆయనను చూసేందుకు కోర్టుకు వచ్చారు. కొడంగల్​ ఫస్ట్​ క్లాస్​ మేజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరిచారు. కస్టడీ పిటిషన్​పై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈనెల 22కు రిజర్వ్​ చేశారు. అనంతరం పట్నం నరేందర్​ రెడ్డిని తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.

పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ - రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావన

'లగచర్ల' ఘటనలో కీలక మలుపు - లొంగిపోయిన ప్రధాన నిందితుడు సురేశ్

ABOUT THE AUTHOR

...view details