Attack on Narsapur MLA Sunitha's House : మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై దాడి ఘటనను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా సునీతా ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణా సంచా పేల్చడాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇంట్లో సునీతా లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు లేరు. వెంటనే పోలీసులు రంగలోకి దిగి, ఇరువర్గాల కార్యకర్తలకు నచ్చచెప్పి పంపించారు.
కాంగ్రెస్ శ్రేణులు ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేశారని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శివంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి గోమారం వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కార్యకర్తల దగ్గర వివరాలు తెలుసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 'మా ఇంటి ముందు కావాలనే టపాసులు కాల్చారు. లోనికి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు. మహిళా ఎమ్మెల్యే నివాసం వద్దకు వచ్చి ఇలా చేయడంపై ఉద్దేశం ఏంటి? వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మా కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. టపాసులు పేలుస్తూ గేటు నుంచి లోపలికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు' అని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
ప్రజా పాలన కాదు - గూండా రాజ్యం నడుస్తోంది : దాడి ఘటనపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో మాట్లాడిన కేటీఆర్, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలతో సునీతా లక్ష్మారెడ్డి మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు సునీతా లక్ష్మారెడ్డి ఇంటికెళ్లి పరామర్శించారు. ఇంటిపై దాడి వివరాలను తెలుసుకున్నారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు ఫోన్ చేసి పోలీసుల ముందే ఘటన జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. సీసీ కెమెరాలో దాడి విజువల్స్ రికార్డ్ అయినా, కేసు విషయంలో ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదని, గూండా రాజ్యం నడుస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.