Nara Bhuvaneshwari Wishes to Lokesh : ఏపీలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు మంత్రి నారా లోకేశ్ కృషి చేయాలని ఆయన తల్లి నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజాసేవ చేస్తూనే ఏపీని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
ఇదే నిబద్ధత భవిష్యత్‌లోనూ కొనసాగాలి: గతంలో మహిళలు న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని నారా భువనేశ్వరి అన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంతో ఏపీలో ఆ పరిస్థితి మారిపోయిందని తెలిపారు. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనితకు, పోలీస్ సిబ్బందికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మహిళల భద్రతపై ఇదే నిబద్ధత భవిష్యత్‌లోనూ కొనసాగాలని నారా భువనేశ్వరి కోరారు.
స్వచ్ఛరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ - ప్రజల మనిషిగా ఎదిగిన నారా లోకేశ్ - Nara Lokesh Inspirational Journey
Lokesh Took Charge as Minister : అంతకుముందు ఏపీ సచివాలయం నాలుగు బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో మంత్రిగా నారా లోకేశ్ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు స్వీకరించారు. తనకు కేటాయించిన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్ మొదటి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్‌పై సంతకం పెట్టారు.
ఈ సందర్భంగా లోకేశ్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
మరోవైపు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయం నిర్వహణపై మంత్రి లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్‌తో పాటు సచివాలయంలో గదులు నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్‌కు వచ్చే వారా అంటూ అధికారులను ఆరా తీశారు. అమాత్యులు ఇక్కడ అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు మంత్రికి చెప్పారు. జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరణ - తొలి సంతకం ఆ దస్త్రంపైనే - Nara Lokesh Takes Charge