Nalgonda - Khammam - Warangal Graduate MLC By Election 2024 : నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టరేట్‌లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. నేడు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. నల్గొండ కలెక్టర్ హరిచందన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్‌ను దాఖలు చేసే అభ్యర్థులు సెలవు దినాలు మినహా, మిగతా అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి.