Minister Ponnam Prabhakar Clarity On New Ration Cards :రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల సర్వే సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర ప్రజానీకానికి సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 కోట్ల 90 లక్ష రేషన్ కార్డులున్నాయని తెలిపారు.
గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని, రేషన్ కార్డు అర్హత ఉండి, రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం ఇవ్వాలని తెలిపారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే నమ్మొద్దని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక అధికారులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందన్నారు.