Minister Ponnam Prabhakar about Ex Sarpanch Pending Bills : రాష్ట్రంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సర్పంచ్‌ల బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ అని, పొలిటికల్ పార్టీల ట్రాప్‌లో పడొద్దని మంత్రి సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి అందరికి తెలుసని, ఓపిక పట్టాలని మార్చి నెలాఖరులోగా బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్ఎస్ నేతలు సర్పంచుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సలహాతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి : బీఆర్ఎస్ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైనే వారే ధర్నాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ డీఎన్‌ఏ లేదని, ఒకవేళ ఉంటే రాష్ట్రానికి ఏమైనా చేసేవారని పొన్నం పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాలను బీఆర్‌ఎస్ రెచ్చగొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేసేందుకు తాము వెళతామన్నారు.
బీజేపీ ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారన్న మంత్రి పొన్నం, చర్చకు సిద్ధమా ? సికింద్రాబాద్ టవర్ వద్దకు వస్తారా ? అంటూ సవాల్ విసిరారు. వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగితే రూ.4 వందల కోట్లు ఇవ్వడమంటే కేంద్రం వద్ద కిషన్ రెడ్డి బలమెంతో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సలహాతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకమయ్యారని ఆరోపించారు.