Two Officials Arrested in Sheep Distribution Scam in Telangana : గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశు గణాభివృద్ధి సంస్థ సీఐవో రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను విచారించిన అనంతరం రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. తొలుత సుమారు రూ.2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు.
ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్టవగా, ఇప్పుడు ఏకంగా సీఐవో స్థాయి అధికారి, మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ కటకటాలపాలయ్యారు. రాంచందర్ గతంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గానూ పని చేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించి పశు గణాభివృద్ధి సంస్థ సీఈవోగా నియమించింది.
నిధుల్ని పక్కదారి పట్టించి : లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అధికారుల ఆమ్యామ్యాల అంశం ముడిపడి ఉండటంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. పశు సంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి, అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని రూ.2 కోట్లు మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి.
గొర్రెల పంపిణీ స్కామ్ కేసు - మరో ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్టు - Sheep Distribution Scam Case Update