Minister Nimmala Ramanaidu Pensions Distribution in West Godavari : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి నేతలు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గత 3 నెలలకు పెంచిన రూ.3 వేలు, జులై నెల పింఛన్ రూ.4 వేలతో కలిపి వృద్ధులు, వితంతువులకు మొత్తం రూ.7 వేలు, దివ్యాంగులకు రూ.15 వేల చొప్పున అందజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా అడవిపాలెంలో ఉదయం 6 గంటల నుంచి అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అందరిలా కాకుండా లబ్ధిదారుల కాళ్లు కడిగి మరీ పింఛన్ అందజేశారు. దివ్యాంగులు, వృద్ధుల ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ పెంపు నిర్ణయంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు, మూడు ఎకరాల పొలం ఇచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. నాడు అన్న మాట ప్రకారమే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడతల వారి పెంపు కాకుండా, ఒకేసారి పింఛన్‌ను పెంచుతూ మానవత్వం చాటుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ : మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. ఇంటింటికి వెళ్లి మరీ లబ్ధిదారులకు ఫించన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంపిణీ ఇవాళ పూర్తవుతుందని, ఒకవేళ ఇవాళ కాకపోతే రేపటి వరకు అందరికీ పింఛన్లు అందజేస్తామని స్పష్టం చేశారు.
మొన్న చెప్పారు - నేడు చేసి చూపించారు : ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంపు ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేస్తున్నారు. పెరిగిన పింఛను రూ.4 వేలతో పాటు గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి మొత్తం రూ.7 వేలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.