Regional Ring Road Project Update : రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం శుభవార్త ప్రకటించింది. ఈ పనులను 5 ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి నిర్మాణానికి టెండర్లను పిలిచింది. రెండేళ్లలో ఉత్తర భాగం పనులను పూర్తిచేయాలని నిబంధన పెట్టింది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారిని నాలుగు వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్మించనుంది. ఉత్తర భాగంపొడవు 161.518 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఆర్.ఆర్.ఆర్ నిర్మాణానికి రూ.7,104.06 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
5 ప్యాకేజీల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనులు :
- మొదటి ప్యాకేజీ : ఉత్తర భాగం పనులలో ఒకటవ ప్యాకేజీ కింద సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లుగా నిర్ణయించారు. దీని నిర్మాణానికి రూ.1,529.19 కోట్లను ఖర్చు చేయనున్నారు.
- రెండో ప్యాకేజీ : రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. దీనికి రూ.1,114.80 కోట్లను కేటాయించారు.
- మూడో ప్యాకేజీ : ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకు 1,184.81 కోట్లను ఖర్చు చేయనున్నారు.
- నాలుగో ప్యాకేజీ : ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు 43 కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి 1,728.22 కోట్లను కేటాయించారు.
- ఐదో ప్యాకేజీ : రాయగిరి నుంచి తంగడ్పల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు రూ.1,547.04 కోట్లను ఖర్చు చేయనున్నారు.
రెండేళ్లలో పూర్తి చేయాలి : ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి టెండర్లు పొందిన సంస్థలు ఈ పనులను మొత్తం రెండేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఐదేళ్ల పాటు రహదారి నిర్వహణ బాధ్యత సైతం చేపట్టాలి. ఈ పనులను ఈపీసీ పద్ధతిలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీని పొడవు 161.518 కిలోమీటర్లుగా నిర్ణయిస్తూ.. రూ.7,104.06 కోట్లను కేంద్రం కేటాయించింది.
ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ : రాష్ట్ర చరిత్రలో ఇది సువర్ణక్షరాలతో లిఖించే రోజని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్.ఆర్.ఆర్ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించానని ఆయన తెలిపారు. ఓ.ఆర్.ఆర్ గేమ్ ఛేంజర్ అయితే, ఆర్.ఆర్.ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నదని అభిప్రాయపడ్డారు. 2017 లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు వెనకబడ్డాయని మంత్రి ఆరోపించారు. అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చుంటే ఈపాటికి రీజినల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కేదని అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు - ఇప్పటికైనా పనులు మొదలయ్యేనా?