Minister Jupally Visited Sarala Sagar in Mahabubnagar :ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం స్టడీ టూర్‌లో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం సరళా సాగర్‌ను సందర్శించారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు :ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి, తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక, వారసత్వ సంపదకు నెలవుగా ఉందని అన్నారు. ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ, గడిచిన 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం, పర్యాటకులను ఆకర్షించడం, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.
"కురుమూర్తి దైవదర్శనం చేసుకున్నాం. సరళాసాగర్‌ను సంద్శించాం. స్వాతంత్ర్యం ముందు ఆసియా ఖండంలోనే లేని సైఫాన్ సిస్టమ్‌లో ప్రాజెక్టును నిర్మించారు. తెలంగాణలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ రంగాన్ని అభివృద్ధి చేయలేదు. రేవంత్ నేతృత్వంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము. పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏం అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి ఉపయోగపడుతుందో అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం." - జూపల్లి, మంత్రి