AICC President Mallikarjun Kharge Slams BJP : ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తామని, అందుకే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎక్కువ విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికీ ఉపయోగం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలని సూచించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుని బీజేపీ ఓట్లు అడగదని, కాంగ్రెస్‌పై నిందలు మోపడం ద్వారానే ఓట్లు అడుగుతారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదంటూనే పదేపదే విమర్శిస్తోందని దుయ్యబట్టారు. తమకు భయపడుతున్నందునే పదేపదే బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
నల్లధనం వెలికి తీస్తామని ప్రధాని మోదీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. నల్లధనం ప్రయోజనాలు వారి మిత్రులకే అందజేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి మాట్లాడట్లేదంటున్నారు. టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ఆరోపణ చేస్తున్నారు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మీరు చూశారా? టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏ చేస్తున్నాయి? అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు చేయండి. అదానీ, అంబానీ ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బందితో తనిఖీలు చేయించండి. ఇలాంటి చిల్ల మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయిలి తగదు. ధనవంతుల ఆస్తులు లాక్కుని పంచుతామనడం సిగ్గుచేటు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలి. - మల్లికార్డున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు