TPCC Chief Mahesh Kumar Comments On Party Defections :తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికలు ఆగలేదని, కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు పార్టీ చేరికలపై స్పందించారు. పాత.. కొత్త నాయకత్వం సమన్వయం చేసుకుని పనిచేయాలన్న మహేశ్‌కుమార్ గౌడ్, కొంతమంది ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని అన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తీరు, గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్ల జైలు కూడా తక్కువేనని హాట్ కామెంట్స్ చేశారు. నిరసనల పేరిట మాజీమంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌లు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. అన్ని పార్టీల ఎన్నికల అజెండాల్లోనూ మూసీ ప్రక్షాళ ఉందని, మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇళ్లు కూడా కూల్చలేదని ఆయన వివరించారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు.
తాను ఎన్నికై 50 రోజులు అయిన సందర్భంగా :దేశ రాజధాని దిల్లీ పర్యటనలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసిన మహేశ్ కుమార్ గౌడ్, తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని రెండేళ్లు పూర్తి కావడంతో, ఖర్గేకి శుభాకాంక్షలు తెలిపారు.