Mahabubabad Lok Sabha Polls 2024 :మానుకోట ఎస్టీ రిజర్వుడు పార్లమెంటు స్ధానంలో సార్వత్రిక ఎన్నికల పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఎన్నికల షెడ్యూల్ స్టార్ట్ అయిన నుంచి అన్ని పార్టీల అగ్రనేతల ప్రచారంతో ఆసక్తికర పోరు సాగింది. గులాబీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, కమల దళం నుంచి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తలపడుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు ఒక్కోసారి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించగా, ఈసారి ఎవరు నెగ్గినా వారికి ద్వితీయ విజయమే అవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలే. నర్సంపేట మాత్రం జనరల్ స్థానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించగా, భద్రాచలం నుంచి నెగ్గిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.
మానుకోటలో నువ్వా-నేనా : గిరిజనుల కోటలో పాగా వేసేందుకు మూడు ప్రధాన పార్టీలు వారి సమస్యలు, అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందుంచుతూ ఓట్లను అభ్యర్థించాయి. ఈ స్థానం పరిధిలో అత్యధికులు గిరిజనులే కావడంతో వారి మన్నన పొందేందుకు ఎంపీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక్కడి నుంచి పోటీలో అభ్యర్థులుగా బరిలో ఉన్న వారంతా లంబాడీలే కాగా, సుమారు నాలుగున్నర లక్షల ఓట్లు ఉన్న ఆదివాసీల మద్దతు ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Mahabubnagar Congress MP candidate Balaram Naik : కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన బలరాంనాయక్ 2009లో ఇక్కడ పోటీ చేసి తొలిసారి విజయ కేతనం ఎగురవేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, రెండుసార్లు ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. పార్టీ మారకుండా ఆరంభం నుంచి కాంగ్రెస్‌లోనే ఉండటం, 2 సార్లు వరుసగా ఓడిపోవడం సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
Mahabubnagar BRS MP candidate Maloth Kavitha :భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత గత బీఆర్ఎస్ సర్కార్ గిరిజనుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నించారు. తనను గెలిపించి గులాబీ పార్టీకి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ తన కుమార్తె కవిత విజయం కోసం పాటుపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు జమ చేశామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని ఇలా అనేక అంశాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదని కవిత ప్రచారం చేస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీని వీడటం, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌లో చేరడం లాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారినా ముందుకెళ్తున్నారు. గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోతో పార్టీ నేతల్లో ఉత్సాహం నింపగా, మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా శ్రమించారు.