Lok Sabha Election Nominations Today 2024 :రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల సమరంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది (Notification Release). నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంటులో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది.
ఈ ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ నిర్వహించి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్లతో పాటు కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4న జరగనుంది..
అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచనలు :
- నామినేషన్లు స్వీకరించేటప్పుడు సెలవు దినాల్లో స్వీకరించరు.
- రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల లోపు మూడు వాహనాలకు మించి అనుమతి ఉండదు.
- నామినేషన్ వేసే అభ్యర్థి సహా నలుగురు వ్యక్తులకు మాత్రమే లోనికి అనుమతిస్తారు.
- కార్యాలయం లోపల, పరిసరాల్లో వీడియో కెమెరా లేదా సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు నామినేషన్లను సువిధ పోర్టల్(Suvidha Portal) ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించిన తర్వాత దాని ప్రతిపై సంతకం చేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.
Lok Sabha Election 2024 : అభ్యర్థులు నామినేషన్‌తో పాటు కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. అఫిడవిట్ లోని ఆస్తులు, నేర చరిత్ర తదితర వివరాలన్నీ నింపాలని ఈసీ స్పష్టం చేసింది. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఏ, బీ ఫారాలను నామినేషన్ల దాఖలుకు చివరి రోజు మూడు గంటల్లోపు సమర్పించాలి. లోక్‌సభకు పోటీ చేసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలయితే రూ.12,500 చెల్లించాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad by Elections)కు పోటీ చేసే అభ్యర్థులు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను కూడా నామినేషన్‌తో పాటు సమర్పించాలని ఈసీ తెలిపింది.